పవన్‌ సార్థక నామధేయుడు : అంబటి

తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సార్థక నామధేయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ తన పేరులోని పవనం, కల్యాణం రెండు పదాలకు న్యాయం చేశారని అంబటి వ్యాఖ్యానించారు. పవనం అంటే గాలి అని.. ఇవాళ పవన్‌ గాలి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిపై ఏనాడూ ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపని విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓడిపోయిన తరువాత ప్రతిపక్షాలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.


రాజధానిలో రెండు తాత్కాలిక బిల్డింగ్‌ నిర్మించి.. అద్భుతం సృష్టించినట్టు చంద్రబాబు భ్రమలు కల్పించారని ఎద్దేవా చేశారు. ఆయన బినామీలకు నష్టం జరుగుతుందనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే ఏం జరిగిందో అందరికి తెలుసని చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించిన చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిపై కచ్చితమైన వాస్తవాలు చెప్పేందుకు తమ ప్రభుత్వం ప్రయతిస్తోందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని అంబటి ఖండించారు.